నేపాల్లోని గోరఖా జిల్లాలో మనాకమన ఆలయం నుండి తిరిగి వస్తున్న భారతీయ యాత్రికులతో ప్రయాణిస్తున్న మైక్రోబస్ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
గోరఖా జిల్లాలోని షాహిద్ లఖన్ గ్రామీణ మునిసిపాలిటీ పరిధిలోని కంతార్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ మైక్రోబస్లో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 14 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు.
ప్రమాదానికి గురైన వాహనం సుమారు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భారతీయ యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని అధికారులు ధృవీకరించారు.
ప్రమాదంలో గాయపడిన మరో ఏడుగురు ప్రయాణికులను స్థానిక అధికారులు, సహాయక బృందాలు సకాలంలో తరలించి చికిత్స అందిస్తున్నాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని అంబుఖైరేని, చిత్వాన్లోని ఆసుపత్రులలో చేర్పించారు.











