ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, లెబనాన్లో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల భద్రతకు హామీ ఇవ్వాలని భారత్, మరో 29 దేశాలు సంయుక్తంగా ఐక్యరాజ్యసమితిలో పిలుపునిచ్చాయి. వారిపై దాడులు, బెదిరింపులు సహించబోమని స్పష్టం చేశాయి.
భారత్ శాశ్వత ప్రతినిధి పి.హరీష్ సమక్షంలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి జెరోమ్ బొన్నెఫోంట్ ఈ ఉమ్మడి ప్రకటనను వెల్లడించారు. శాంతి పరిరక్షకులను లక్ష్యంగా చేసుకునే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారి భద్రతను నిర్ధారించాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
ఇటీవల దక్షిణ లెబనాన్లో హిజ్బుల్లాహ్ దాడుల నేపథ్యంలో ముగ్గురు ఘనా దేశానికి చెందిన శాంతి పరిరక్షకులు గాయపడిన సంఘటన ఈ ప్రకటనకు దారితీసింది. ఈ నేపథ్యంలో, భద్రతా మండలిలో లెబనాన్ పరిస్థితిపై చర్చ జరిగింది.
హిజ్బుల్లాహ్, ఇరాన్ దాడుల్లోకి ప్రవేశించడం బాధ్యతా రహితమైన చర్య అని, ఇది లెబనాన్ ను అనాలోచిత యుద్ధంలోకి లాగిందని ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి పరిరక్షకులపై ఎలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని నొక్కి చెప్పారు.

