అమెరికాలో భారతీయ మూలాలున్న ప్రజల చరిత్ర, సంస్కృతి, దేశ అభివృద్ధికి వారు అందించిన సేవలను గుర్తించేందుకు జూలై నెలను భారతీయ అమెరికన్ల వారసత్వ మాసంగా ప్రకటించాలని అమెరికా కాంగ్రెస్‌లో ప్రతిపాదన దాఖలైంది. ఇల్లినాయిస్కు చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 256 మంది సభ్యులు మద్దతు తెలిపారు.
అమెరికాలో 52 లక్షలకు పైగా భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారని, విజ్ఞానం, వైద్యం, సాంకేతికత, వ్యాపారం, విద్య, సైనిక సేవలు, ప్రభుత్వ రంగం, కళలు, క్రీడలు, దాతృత్వం వంటి విభిన్న రంగాల్లో వారు అందించిన సేవలను గుర్తించడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని తీర్మానంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్థిక వ్యవస్థకు, వైవిధ్యానికి సహకారం
భారతీయ అమెరికన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పరిశోధనలకు, సాంస్కృతిక వైవిధ్యానికి, ప్రజాసేవకు గణనీయమైన సహకారం అందించారని తీర్మానం పేర్కొంది. వివిధ మతాలు, భాషలు, ప్రాంతీయ సంప్రదాయాలకు చెందిన వారి వారసత్వాన్ని కూడా ఈ ప్రతిపాదన గుర్తిస్తోంది.






