ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఒకే ప్రాంతాన్ని నిరవధికంగా ఆక్రమించుకోవడానికి అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనలకు నిర్దిష్ట సమయం, నిర్ణీత కాలపరిమితి ఉండాలని సూచించింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. సామూహిక నిర్బంధాలు, పోలీసుల దౌర్జన్యం, మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ నిలిపివేత వంటి అంశాలు పిటిషన్లలో ప్రస్తావనకు వచ్చాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారిస్తూ, నిరసనలకు అనుమతి ఇచ్చినా, నిరాకరించినా సంబంధిత అధికారులు అందుకు గల కారణాలను ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. ఒక వర్గం నిరసన తెలుపుతున్నందున ఇతరులకు అదే ప్రాంతంలో నిరసన తెలిపే హక్కును నిరాకరించలేమని పేర్కొంది.
వ్యాపార సంఘాల ఆందోళన
ఢిల్లీలోని కిరాణా కమిటీ, ఢిల్లీ ఐరన్ అండ్ హార్డ్‌వేర్ మర్చంట్స్ అసోసియేషన్ కూడా ఈ వ్యవహారంలో పిటిషన్ దాఖలు చేశాయి. మధ్య ఢిల్లీ, కన్నాట్ ప్లేస్ ప్రాంతాల్లో నిరసనల వల్ల వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, రోజుకు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వ్యాపార నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి.

