పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2013లో ఢిల్లీలో జరిగిన ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన కేసులో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఢిల్లీ పోలీసుల బృందం కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసానికి వెళ్లి నోటీసులు అందించింది. దర్యాప్తు అధికారులు ఆమెకు అనుకూలమైన తేదీ, ప్రదేశంలో వాంగ్మూలం నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు సమాచారం.
2013లో అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాపై వామపక్ష విద్యార్థి సంఘం కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో మమతా బెనర్జీ మంత్రులు, ఎంపీల బృందంతో ఢిల్లీకి వెళ్లారు. ఈ ఘటనకు నిరసనగా పార్లమెంట్ స్ట్రీట్ సమీపంలోని అప్పటి ప్రణాళికా సంఘం కార్యాలయం వద్ద తృణమూల్ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మమతా బెనర్జీ బృందం కదలికలు, భద్రతా ఏర్పాట్ల విషయంలో పోలీసులతో వాగ్వాదం జరిగినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కేసులో మమతా బెనర్జీని నిందితురాలిగా పిలవలేదని, ఘటనకు సంబంధించి ఆమె వాంగ్మూలం నమోదు చేయడమే నోటీసుల ఉద్దేశమని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. కొన్ని నివేదికలు ఆమెను బాధితురాలిగా పేర్కొన్నాయి. ఈ కేసులో ఇతర సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నట్లు సమాచారం.
13 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు మళ్లీ విచారణ ప్రక్రియ ముందుకు రావడం బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

