ఆదిలాబాద్ జిల్లాలో పత్తితో పాటు ఇతర పంటలు ఎండుముఖం పడుతున్న సమయంలో, నీటిపారుదల శాఖ అధికారులు సాగునీటి వినియోగంపై ఆంక్షలు విధించడం రైతుల్లో ఆందోళనకు కారణమైంది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో, చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు, కాలువలు, వాగుల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడుకోవద్దని అధికారులు ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు నమస్తే తెలంగాణ కథనం తెలిపింది. జిల్లాలో ఈ వానాకాలం సుమారు 5.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, అందులో 4.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి కాయల నుంచి దూది బయటకు వచ్చే దశలో ఉన్నందున, ఒకటి, రెండు తడులు అందిస్తే పంటను కాపాడుకోవచ్చని రైతులు భావిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, ఎండలు పెరగడం, విద్యుత్ కోతలు వంటి సమస్యలతో పంటలకు నీరు అందించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. పత్తి సాగుకు ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు ఖర్చు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు చేతికి రావాలంటే, పంటను చివరి దశ వరకు కాపాడుకోవాల్సి ఉందని చెబుతున్నారు.









