దుబాయ్ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చిన విమానంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానం టాయిలెట్ స్పీకర్లలో దాచి ఉంచిన సుమారు 2,799 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు 4.26 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్మగ్లర్లు బంగారం తరలింపునకు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారని ఈ సంఘటన ద్వారా వెల్లడైంది.
అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో టాయిలెట్లో రెండు అనుమానాస్పద పౌచ్‌లను గుర్తించారు. ఆ పౌచ్‌లను తెరిచి చూడగా, వాటిలో 24 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం జరిగినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రయాణికులపై నిఘా పెంచినట్లు సమాచారం.












