అంతరిక్ష పరిశోధనలో జపాన్ మరో కీలక ముందడుగు వేసింది. అంగారక గ్రహానికి చెందిన రెండు ఉపగ్రహాలు ఫోబోస్, డీమోస్ల పుట్టుక వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు రూపొందించిన అంతరిక్ష నౌకను జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా విజయవంతంగా ప్రయోగించింది. 2020లో దక్షిణ జపాన్‌లోని తనెగషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్-3 రాకెట్ ద్వారా ఈ నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగించిన సుమారు 71 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి అంతరిక్ష నౌక విజయవంతంగా విడిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఐదేళ్ల మిషన్‌లో భాగంగా ఫోబోస్ ఉపరితలం నుంచి మట్టి, ధూళి, రాతి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం ప్రధాన లక్ష్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఫోబోస్, డీమోస్.. శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యం
అంగారకుడికి రెండు సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఫోబోస్ పెద్దది, గ్రహానికి దగ్గరగా పరిభ్రమిస్తుంది. దీని వ్యాసం సుమారు 22 కిలోమీటర్లు. రెండో ఉపగ్రహమైన డీమోస్ మరింత చిన్నది. ఈ రెండు ఉపగ్రహాలు ఎలా ఏర్పడ్డాయనే ప్రశ్నకు శాస్త్రవేత్తల వద్ద ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. వాటి పుట్టుకకు సంబంధించి ప్రధానంగా రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి.. పురాతన కాలంలో భారీ ఖగోళ వస్తువు అంగారకుడిని ఢీకొనడంతో వెలువడిన పదార్థం కలిసి ఉపగ్రహాలు ఏర్పడ్డాయనేది. రెండోది.. అవి మొదట గ్రహశకలాలుగా ఉండి, అంగారకుడి గురుత్వాకర్షణకు చిక్కుకుని దాని చుట్టూ తిరగడం ప్రారంభించాయనేది. ఫోబోస్ నుంచి సేకరించే నమూనాలు ఈ సిద్ధాంతాల్లో ఏది సరైనదో తెలుసుకునేందుకు సహాయపడవచ్చు.
నమూనాల సేకరణ ఎలా జరుగుతుంది
జపాన్ రూపొందించిన ఈ మిషన్‌కు మార్టియన్ మూన్స్ ఎక్స్‌ప్లోరేషన్ (ఎంఎంఎక్స్) అని పేరు పెట్టారు. ఈ అంతరిక్ష నౌక 2027లో అంగారకుడి సమీపానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడ ఫోబోస్‌ను పరిశీలించి, దాని ఉపరితలంపై దిగేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మిషన్‌లో భాగంగా, ఐడెఫిక్స్ అనే చిన్న రోవర్‌ను ఫోబోస్‌పైకి పంపనున్నారు. ఫ్రాన్స్, జర్మనీ అంతరిక్ష సంస్థల సహకారంతో అభివృద్ధి చేసిన ఈ రోవర్ ఉపరితల పరిస్థితులను పరిశీలించి, నమూనాల సేకరణకు అనువైన ప్రాంతాన్ని గుర్తించడంలో తోడ్పడుతుంది. అనంతరం ప్రధాన నౌక ఫోబోస్ నుంచి కనీసం 10 గ్రాముల మట్టి, ధూళి, రాతి పదార్థాలను సేకరించేందుకు ప్రయత్నిస్తుంది.

