జీవ ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, హరిత సాంకేతికతల రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం, బల్గేరియా దేశం చర్చలు జరిపాయి. న్యూఢిల్లీలోని బల్గేరియా రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, పెట్టుబడులు, పరిశోధన, పారిశ్రామిక భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.
కర్ణాటక రాష్ట్ర జీవ ఇంధన అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎస్.ఈ. సుధీంద్ర, బల్గేరియా రిపబ్లిక్ వాణిజ్య, ఆర్థిక వ్యవహారాల విభాగం అధిపతి ఎవో స్టోయనోవ్ కఫెడ్జీవ్తో సమావేశమయ్యారు. కర్ణాటకలో వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను సమర్థంగా వినియోగించి జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని సుధీంద్ర వివరించారు. ఈ వనరులను వినియోగించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభించడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ మార్గాలు, స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలను సేకరించడం నుంచి వాటిని శుద్ధి చేసి ఇంధనంగా మార్చడం, పంపిణీ చేయడం వరకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ రంగంలో బల్గేరియాతో కలిసి పనిచేయడం ద్వారా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవచ్చని, పరిశోధనలను వాణిజ్య స్థాయికి తీసుకెళ్లవచ్చని తెలిపారు.












