రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు చిట్టిల పేరుతో సుమారు రూ.6.5 కోట్ల రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి (45) అనే మహిళను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బద్దం జ్యోతి రెడ్డి గత 9 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతూ, తన పరిచయస్తులతో చిట్టిలు నడుపుతూ వచ్చింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై అధిక లాభాలు ఆశచూపి, చాలా మందిని నమ్మించి వారి నుండి డబ్బులు వసూలు చేసింది.
2020 సంవత్సరం నుండి, నిందితురాలు సుమారు 20 మంది బాధితులను మోసం చేసి, దాదాపు రూ.6.5 కోట్ల నగదుతో పరారైంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో, ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు చిట్టిల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితురాలిపై భారతీయ న్యాయ స్మృతి (BNS)లోని సెక్షన్ 318(4), 316(2) మరియు చిట్ ఫండ్ చట్టం 1982లోని సెక్షన్ 76 కింద కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
ఈ మోసం వల్ల బాధితులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిసింది. పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు మరియు ఇతర బాధితులు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీస్తున్నారు.











