జలధార - జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న తంగడంచ చెరువు అభివృద్ధి పనులను ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేలా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తంగడంచ చెరువు పరిధిలో జరుగుతున్న ఫీడర్ ఛానల్, నీటి ప్రవాహ మార్గాల అభివృద్ధి, చెరువు కట్టల బలోపేతం, నిల్వ సామర్థ్య పెంపు పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా, పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు నిరంతరం పనుల పర్యవేక్షణ చేస్తూ, ఎప్పటికప్పుడు పురోగతిని నివేదించాలని ఆదేశించారు.
చెరువు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తాగునీటితో పాటు సాగునీటి అవసరాలను తీర్చవచ్చని ఆమె తెలిపారు. తంగడంచ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.










