విజయనగరం జిల్లా బొండపల్లిలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి, సుమారు 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కూరగాయల మాటున అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయి విలువ సుమారు రూ. 3.20 కోట్లు ఉంటుందని అంచనా.
పక్కా సమాచారం మేరకు, ఒడిశాలోని సిమిలిగూడ నుండి విశాఖపట్నం వైపు తరలిస్తున్న ఒక బొలెరో వాహనాన్ని అధికారులు బొండపల్లి వద్ద అడ్డగించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ వాహనాన్ని తనిఖీ చేయగా, కూరగాయల చాటున దాచిన గంజాయి బయటపడింది.
నిందితులు పోలీసులను మోసం చేసేందుకు గంజాయి ప్యాకెట్లను ఉంచి, వాటిపై క్యాబేజీలను లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యూహాన్ని ఛేదించిన అధికారులు, వాహనం నుంచి 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో వాహనాన్ని నడుపుతున్న అజయ్ రాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయిని తరలించే ప్రయత్నం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.











