కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మేనిఫెస్టోను దహనం చేసి నిరసన తెలిపారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకోవడంతో పాటు, ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
గత రెండేళ్లుగా వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు. కూటమి నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన విమర్శించారు.
వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల వరదలు వచ్చినా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ ప్రజలను మోసం చేశారని, నగరాభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
రాబోయే 2029 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని, వైయస్ఆర్ సీపీ కూటమి ప్రభుత్వ మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











