దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ (20) నాణ్యతపై వివాదం మొదలైంది. పెట్రోల్‌లో నిర్ణీత పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నారని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించగా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ వాదనలను ఖండించాయి. కొన్ని నమూనాల్లో 26 నుంచి 31.2 శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
అయితే పరీక్షల విధానం, నమూనాల సేకరణ ప్రక్రియలో లోపాలున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం స్పష్టం చేశాయి. కర్ణాటక ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, న్యాయ కొలతల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల నుంచి నమూనాలు సేకరించినట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలు
వాటిని పరీక్షించగా కొన్ని నమూనాల్లో ఇథనాల్ శాతం 20 శాతానికి మించి ఉన్నట్లు గుర్తించామని, ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌లో 31.2 శాతం, హెచ్‌పీసీఎల్ పెట్రోల్‌లో 30.5 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై చమురు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నిర్ణీత పరిమితికి మించి ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగం వల్ల వాహనాల మైలేజీ తగ్గే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇంధన పంపులు, ఇంజెక్టర్లు, ఫిల్టర్లు, గొట్టాలు, సీల్స్ వంటి విడిభాగాలపై కూడా ప్రభావం పడవచ్చని పేర్కొన్నారు.











