నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం భిక్నూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించి, స్టేషన్ పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది విధులు, నేరాల పరిస్థితి, అనుమానిత వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు ఫైళ్లు, కేసు డైరీలు, జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించాలని, నిర్ణీత గడువులో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు రాత్రి గస్తీని పటిష్టం చేయాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. క్రమశిక్షణ, సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలని ఎస్పీ సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ ఎస్. మధుసూదన్, సీఐ జె. నరేష్, ఎస్హెచ్ఓ అనిల్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

