తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, రద్దీ నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మరియు టీటీడీ సీవీ అండ్ ఎస్ఓ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్., లు పోలీసు అధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లు, విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహనసేవలను భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా దర్శించుకునేలా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీ అండ్ ఎస్ఓ) శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్., గారు తిరుమల పోలీస్ కంట్రోల్ రూమ్‌లో బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు అధికారులతో సంయుక్తంగా సమావేశమై భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ, విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రత, సౌకర్యాలే పోలీసుల ప్రధాన ప్రాధాన్యతలని పేర్కొన్నారు. వాహనసేవల సమయంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. మాడ వీధులు, వాహనసేవల మార్గాలు, క్యూలైన్లు, ప్రవేశనిష్క్రమణ మార్గాల్లో రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టి, తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి మనోభావాలను గౌరవించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. భద్రతా విధుల్లో క్రమశిక్షణ పాటిస్తూనే, భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. భక్తులకు ఏదైనా సమస్య ఎదురైతే తక్షణమే స్పందించి సహాయం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తూ వేగంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల దృష్ట్యా చిన్నారులు తప్పిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న బయో ట్యాగింగ్ సదుపాయాలు, హెల్ప్‌డెస్క్‌లు, సహాయ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగిస్తూ, తప్పిపోయిన చిన్నారులు లేదా ఇతర భక్తులను త్వరితగతిన గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిరంతర నిఘా ఉంచాలని, భద్రతా తనిఖీలను కచ్చితంగా నిర్వహించాలని, అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ వ్యవస్థలను సమన్వయంతో వినియోగించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు సులభంగా చేరుకునేలా మార్గాలను అందుబాటులో ఉంచాలని, భక్తులకు పోలీసుల సహాయం అవసరమైనప్పుడు డయల్ 112 ద్వారా సంప్రదించవచ్చని తెలియజేయాలని సూచించారు.












