తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, పాదరక్షల భద్రతను మెరుగుపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ ఫుట్‌వేర్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది.
లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. గతంలో, పాదరక్షలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల అవి పోగొట్టుకోవడం, అపరిశుభ్రత ఏర్పడటం వంటి సమస్యలు ఉండేవి. పాదరక్షల భద్రత కోసం ప్రత్యేక కౌంటర్లు ఉన్నా, రద్దీ కారణంగా భక్తులు సమయం వృధా చేసుకోవాల్సి వచ్చేది.
ఈ సమస్యల పరిష్కారానికి, టీటీడీ అత్యాధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను అమలు చేసింది. దీని ద్వారా భక్తులు తమ పాదరక్షలను సులభంగా, సురక్షితంగా భద్రపర్చుకోవచ్చు. ఈ వ్యవస్థ అమలుతో తిరుమలలో పరిశుభ్రత కూడా మెరుగుపడిందని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు 8,45,816 మంది భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ వ్యవస్థను విస్తరింపజేయాలని టీటీడీ యోచిస్తోంది. ఇది భక్తులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.
కొంతమంది భక్తులకు ఈ కొత్త వ్యవస్థపై అవగాహన లేకపోవడంతో, టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తూ, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది. ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ వల్ల పాదరక్షల భద్రతా కేంద్రాల వద్ద రద్దీ కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు పేర్కొన్నారు.











