బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు వచ్చిన బెదిరింపు సందేశాల కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో నటులకు బెదిరింపులు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 ఏళ్ల ఇంజినీర్ వైభవ్ మిశ్రాను బెంగళూరులో అరెస్టు చేశారు. అయితే, అతడికి బిష్ణోయ్ గ్యాంగ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు.
ఆయుష్మాన్ ఖురానాకు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఒక బెదిరింపు సందేశం అందింది. తాను లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడినంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి, నటుడిని కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. సందేశం పంపిన వ్యక్తి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలను పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తుషార్ కపూర్‌కు కూడా ఇలాంటి సందేశం
గతంలో నటుడు తుషార్ కపూర్‌కు కూడా ఇదే తరహాలో బెదిరింపు ఆడియో సందేశం వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో పంపిన వ్యక్తి తనను హ్యారీ బాక్సర్‌గా పరిచయం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఆడియోలోని గొంతు పోలీసుల వద్ద ఉన్న నమూనాలతో సరిపోలలేదని ప్రాథమిక పరిశీలనలో తేలింది. దీంతో, గ్యాంగ్ పేరును ఉపయోగించి భయపెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బెంగళూరులో నిందితుడి అరెస్ట్
దర్యాప్తులో భాగంగా బెదిరింపు సందేశాల వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా, తుషార్ కపూర్‌తో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు కూడా ఇలాంటి సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు ఆటో-డిలీట్ ఫీచర్‌ను ఉపయోగించినట్లు తెలిసింది. తొలగించిన సందేశాలను తిరిగి పొందేందుకు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

