ప్రముఖ భారతీయ యూట్యూబర్ సౌరవ్ జోషి కుటుంబ వ్లాగ్లోని ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య అవంతిక భట్కు పెంపుడు కుక్క ఓరియో నీళ్లు తాగే గిన్నె నుంచి నీళ్లు తాగాలని సవాలు విసరడం వివాదానికి దారితీసింది. ఈ వీడియోలో అవంతిక తొలుత సంకోచించినప్పటికీ, చివరకు ఆ సవాలును పూర్తి చేశారు.
ఈ దృశ్యాలు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు సౌరవ్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. సౌరవ్ జోషి తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆట ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటలో భాగంగా అవంతికకు తన పెంపుడు కుక్క ఓరియో నీళ్లు తాగే గిన్నె నుంచి నీళ్లు తాగాలని సవాలు ఇచ్చారు. మొదట ఆమె అందుకు ఇష్టపడలేదు. అయితే, ఒక్క గుక్క నీళ్లు తాగాలని సౌరవ్ కోరారు. గిన్నెలో తాజాగా నీళ్లు పోశామని కూడా చెప్పారు. చివరకు అవంతిక ఆ సవాలును పూర్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ వీడియోలోని భాగం సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో విమర్శలు మొదలయ్యాయి. వినోదం కోసం భార్యను ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టడం సరైన పద్ధతి కాదని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు వ్యక్తిగత సంబంధాలను వీడియోల రూపంలో చూపించే సమయంలో గౌరవం, పరస్పర అంగీకారానికి ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
సౌరవ్పై నెటిజన్ల విమర్శలు
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని సాధారణ ఆటలో భాగంగా చూడాలని అంటుండగా, మరికొందరు భార్యను అవమానించేలా ఉందని విమర్శిస్తున్నారు. యూపీఎస్సీ అభ్యర్థులకు బోధించే ఉపాధ్యాయుడు, రిజాల్వ్ ఐఏఎస్ వ్యవస్థాపకుడు అమిత్ కిల్హోర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆయన సౌరవ్ ప్రవర్తనను మహిళా వ్యతిరేక ధోరణిగా అభివర్ణించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.





