కామారెడ్డి, 9 November
హార్వెస్టర్ మిషన్లను లీజుకు ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తిని కారులో కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు నిందితులను దోమకొండ పోలీసులు అరెస్టు చేశారు. జైలులో ఏర్పడిన పరిచయంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ వెల్లడించారు. కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేష్ (32) హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. నిందితుల్లో ఒకరు కరుణాకర్ రెడ్డి అనే నకిలీ పేరుతో నెల రోజుల పాటు ఫోన్లో మాట్లాడి హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించాడు. కొత్త హార్వెస్టర్ మిషన్లు చూపిస్తామని చెప్పి మహేష్‌ను ఎర్టిగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అతని ముఖానికి ఉన్ని టోపీని తొడిగి దాడి చేస్తూ రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. సెల్‌ఫోన్, రూ.2,500 నగదును లాక్కున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిందితులు మద్యం సేవించి నిద్రలోకి జారుకున్న సమయంలో మహేష్ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోసారి కిడ్నాప్‌కు యత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. నిట్టూ నర్సింగరావు, ఎరుగు నగేష్ అలియాస్ నాయేష్, తెడ్డూ సురేష్, చిందం శ్రీకాంత్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఎర్టిగా కారు, మొబైల్ ఫోన్లు, ఉన్ని టోపీ, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సీఐ నరేష్, దోమకొండ ఎస్సై ప్రభాకర్ ఆధ్వర్యంలోని రెండు ప్రత్యేక బృందాలు సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించాయి. ఈ కేసులో చురుకుగా పనిచేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.












