కడప, 2027-05-26
జనగణన2027 రెండవ దశ అయిన జనాభా గణనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అవసరమైన ముందస్తు ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా జనగణన అధికారి వెంకటపతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సభాభవన్, పిజిఆర్ఎస్ హాలులో రెండవ దశ జనగణన నిర్వహణలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా గణనలో ఎవరూ మినహాయించబడకుండా ప్రతి ఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన, విధాన నిర్ణయాలు, నిధులు, వనరుల కేటాయింపులో జనగణన గణాంకాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. జనగణన2027ను డిజిటల్ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో స్వీయ గణన ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో జనగణన మొదటి దశలో భాగంగా నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ఇండ్ల జాబితా తయారీ, గృహ గణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం, ఛార్జి అధికారులు, గణకులు, పర్యవేక్షకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. రెండవ దశ జనాభా గణనకు సంబంధించి సిబ్బంది నియామకం, గణకులు, పర్యవేక్షకులకు సమగ్ర శిక్షణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టణ ప్రాంతాలు, వలస జనాభా, నిరాశ్రయులు, ఖాళీగా ఉన్న ఇళ్లు, తాళం వేసి ఉన్న గృహాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జనాభా గణనలో 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ద్వారా జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వలసలు, సంతానోత్పత్తి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ప్రశ్నపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడడం, డిజిటల్ పరికరాలను సమర్థవంతంగా వినియోగించడంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. మొదటి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, అధికారులందరూ సమష్టి కృషి, అంకితభావం, సమన్వయంతో రెండవ దశ జనాభా గణనను కూడా విజయవంతంగా నిర్వహించి జనగణన2027లో జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జనగణన సహాయ సంచాలకులు సుప్రేజ్ పాల్గొన్నారు. జిల్లా జనగణన ఇన్చార్జి మోహన్ రమణ జనగణన2027 రెండవ దశకు సంబంధించిన ముందస్తు సన్నద్ధత, విధివిధానాలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై దృశ్య ప్రదర్శన ద్వారా వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, నగరపాలక సంస్థ కమిషనర్, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.












