ఇతరుల గుర్తింపు వివరాలను ఉపయోగించి అనుమతి లేకుండా సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడం, వాటిని విక్రయించడం వంటి ఆరోపణలపై కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ కార్డుల పంపిణీ, యాక్టివేషన్, వినియోగదారుల గుర్తింపు ధ్రువీకరణలో భద్రతా విధానాలను సమీక్షించాలని పోలీసు సైబర్ కమాండ్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. జియో సంస్థలో ప్రమోటర్‌గా పనిచేసిన మల్లికార్జున వద్ద 75 సిమ్ కార్డులు ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. వీటిలో 55 జియో సిమ్ కార్డులు, 20 వొడాఫోన్ సిమ్ కార్డులు ఉన్నాయని, అవి వేర్వేరు వ్యక్తుల పేర్లతో ముందుగా యాక్టివేట్ అయ్యాయని ప్రాసిక్యూషన్ పేర్కొంది. సిమ్ కార్డులు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారుల ఆధార్ వివరాలు, ఫొటోలను సేకరించి, వాటిని అనధికారికంగా యాక్టివేషన్‌కు ఉపయోగించారనేది పోలీసుల ఆరోపణ. అయితే తాను సిమ్ కార్డులను యాక్టివేట్ చేయలేదని, జియో సిమ్ కార్డులను విక్రయించేందుకు మాత్రమే తనకు అప్పగించారని పిటిషనర్ వాదించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సైబర్ నేరాలకు దుర్వినియోగం
సిమ్ కార్డులు కేవలం ఫోన్ సేవలకే పరిమితం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. వాటి ద్వారా ఒకసారి ఉపయోగించే సంకేతాలు (ఓటీపీలు) స్వీకరించడం, ఆన్లైన్ ఖాతాలు నమోదు చేయడం, ఆర్థిక సేవలను పొందడం వంటి పనులు జరుగుతాయని పేర్కొంది. ఇతరుల పేర్లతో, వారి అనుమతి లేకుండా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి వినియోగిస్తే, గుర్తింపు వివరాల దుర్వినియోగం, ఆర్థిక మోసాలు, ఇతర సైబర్ నేరాలకు అవకాశం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.












