కామారెడ్డి, 2026-07-29
మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. ప్రసన్న బుధవారం ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పరిశీలించారు. ఈ నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మహిళా శిశు సంక్షేమ శాఖలో భర్తీ చేయనున్న అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. ప్రసన్న బుధవారం ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించి, సంబంధిత సీడీపీవోకు అవసరమైన సూచనలు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఐ. ప్రసన్న మాట్లాడుతూ, "జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, మహిళా శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారమే ప్రతి సర్టిఫికెట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 95 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 95 అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు ఎలాంటి మధ్యవర్తులను నమ్మవద్దు. నియామకాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా లేదా తప్పుడు హామీలు ఇచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత సీడీపీవో కార్యాలయాన్ని నేరుగా సంప్రదించాలి. శాఖ సిబ్బంది అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు." అని తెలిపారు.











