కడప, 2024-11-11
కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవి కోసం మరో నేత తన అభ్యర్థిత్వాన్ని తెరపైకి తీసుకొచ్చారు. టీడీపీ సీనియర్ నాయకుడు బుర్రి రెడ్డయ్య యాదవ్ డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత 62వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవమైన ఆయన, పార్టీ కోసం గత రెండు దశాబ్దాలుగా చేసిన సేవలను గుర్తించి డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2009, 2014 ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్‌గా, 2019 ఎన్నికల్లో కడప నియోజకవర్గ జనరల్ ఏజెంట్‌గా పార్టీ బాధ్యతలు నిర్వహించినట్లు తన వినతిపత్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కడప జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసి, పాదయాత్ర విజయవంతం కావడంలో పార్టీ శ్రేణులతో కలిసి తన వంతు పాత్ర పోషించినట్లు వివరించారు. యువగళం పాదయాత్రలో తన చురుకైన భాగస్వామ్యాన్ని కూడా పార్టీకి చేసిన సేవల్లో ముఖ్యమైన అంశంగా ప్రస్తావిస్తున్నారు.
2023లో చంద్రబాబు సూచనల మేరకు కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి విజయానికి యాదవ సామాజికవర్గాన్ని సమన్వయం చేసి మద్దతు కూడగట్టినట్లు తెలిపారు. తన చొరవతో ఇతర సామాజికవర్గాలు సైతం మాధవి రెడ్డికి మద్దతుగా సమావేశాలు నిర్వహించాయని, ఆమె 18 వేలకు పైగా మెజారిటీ సాధించడంలో తమ వంతు పాత్ర పోషించామని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!





