కామారెడ్డి జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరాలలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించాలని ఐవిఎఫ్ సేవాదళ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరాలలో సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అందజేసి వారి ప్రాణాలను కాపాడాలని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు, తెలంగాణ రాష్ట్ర ఫార్మ కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
తలసేమియా బాధిత చిన్నారులకు జీవితాంతం ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చిన్నారులు 6 వేలకు పైగా ఉన్నారని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 200 మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని డాక్టర్ బాలు, చిలువేరి మారుతి వివరించారు. వారి ప్రాణాలను కాపాడాలంటే సకాలంలో రక్తాన్ని అందించడం అత్యవసరమని, ఈ వ్యాధితో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎస్పీకి తెలియజేశారు.












