కామారెడ్డి, జూలై 29
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెయిన్బో బ్లడ్ బ్యాంక్‌ను డీఎస్పీ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి బుధవారం ప్రారంభించారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, స్వచ్ఛంద రక్తదానం ద్వారానే అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడవచ్చని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పారు.
వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ఇప్పటికీ ప్రత్యామ్నాయం లేదని, మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసే దాతల వల్లే అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుందని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ అన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు నిరంతరం రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రెయిన్బో బ్లడ్ బ్యాంక్‌ను డీఎస్పీ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి బుధవారం ప్రారంభించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ, రక్తం అందుబాటులో లేక ప్రతి ఏడాది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా థలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరమవుతుందని, అలాంటి చిన్నారుల జీవితాలను కాపాడేందుకు మరింత మంది రక్తదాతలు ముందుకు రావాలని కోరారు. నూతనంగా బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు.











