కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎల్లమ్మ తండా సమీపంలోని ఖందకాల ప్రాంతంలో ఉన్న చారిత్రక రాతి చిత్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని, సందర్శకులు సులభంగా వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
లింగంపేట మండలం ఎల్లమ్మ తండా సమీపంలోని ఖందకాల ప్రాంతంలో ఉన్న చారిత్రక రాతి చిత్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాతిపై చిత్రించిన ప్రాచీన చిత్రాలను స్వయంగా వీక్షించి, వాటి ప్రత్యేకతలు, చారిత్రక ప్రాధాన్యతను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని రాతిపై వీబీజీ రామ్ జీ అనే అక్షరాలు రాసి ఉండటాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాంతం ప్రధాన రహదారికి సమీపంలో ఉండటంతో, పర్యాటకులు సులభంగా చేరుకుని చారిత్రక రాతి చిత్రాలను వీక్షించేందుకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా పరిరక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు. రాతి చిత్రాల చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని, సందర్శకులు సులభంగా వీక్షించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయమైన చారిత్రక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎంపీడీఓకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సురేందర్, మండల రెవెన్యూ అధికారి, ఎంపీడీఓ ప్రవీణ్‌తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.






