ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన 125వ వార్షికోత్సవం సందర్భంగా క్లాసిక్ 650 మోటార్‌సైకిల్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ 125వ వార్షికోత్సవ ఎడిషన్ పేరుతో వచ్చిన ఈ బైక్ ధర రూ.4,25,589గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 125 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు.
ప్రత్యేక రంగుల కలయిక, పాతకాలపు రూపాన్ని ప్రతిబింబించే అలంకరణలు ఈ మోడల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ బైక్‌లో ప్రత్యేకంగా రూపొందించిన హైపర్‌షిఫ్ట్ పెయింట్ ఫినిష్ను అందించారు. వెలుతురు పడే కోణాన్ని బట్టి ఎరుపు, ఆకుపచ్చ, బంగారు ఛాయలు కనిపిస్తాయి. ఇంధన ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, మడ్‌గార్డులు, హెడ్‌ల్యాంప్ చుట్టూ ఈ రంగుల అలంకరణ కొనసాగుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
1901లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రారంభ దశ మోటార్‌సైకిళ్లలో కనిపించిన ఇత్తడి ఛాయల నుంచి ఈ రంగుల రూపకల్పనకు స్ఫూర్తి పొందినట్లు సంస్థ వివరించింది. ట్యాంక్‌పై చేతితో వేసిన గీతలు, ఫిరంగి గుర్తుతో కూడిన ప్రత్యేక చిహ్నం, సైడ్ ప్యానెల్‌పై 125 ఏళ్ల వార్షికోత్సవ గుర్తు ఈ మోడల్‌కు ప్రత్యేకతను ఇస్తాయి. నలుపు రంగులో ఉండే ఇంజిన్, ఎగ్జాస్ట్ భాగాలు బైక్ రూపానికి భిన్నమైన ఆకర్షణను జోడిస్తాయి.












