కృత్రిమ మేధస్సు (ఏఐ) భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దడానికి మూడు మార్గాలను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ సూచించారు. అంతర్జాతీయ పర్యవేక్షణ, ప్రముఖ ఏఐ సంస్థలన్నీ ఒకే వ్యవస్థ కిందకు రావడం, లేదా ఒకే సంస్థ కంప్యూటింగ్ శక్తిని పూర్తిగా నియంత్రించడం వంటివి ఆయన ప్రస్తావించారు. వీటిలో మూడో మార్గాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధి వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఈ సాంకేతికతను సురక్షితంగా అభివృద్ధి చేయడానికి మూడు సాధ్యమైన మార్గాలను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ వివరించినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడం, లేదా ఒకే సంస్థ అపారమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సొంతం చేసుకుని మిగిలిన సంస్థలకు అవకాశాలు లేకుండా చేయడం వంటి మూడు పరిస్థితులను ఆయన ప్రస్తావించినట్లు ది ఇన్ఫర్మేషన్ కథనం వెల్లడించింది. వీటిలో మూడో మార్గాన్ని ఆల్ట్‌మన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏఐ కోసం అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థ
అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం మొదటి ప్రతిపాదన. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తరహాలో ఈ వ్యవస్థ పనిచేయవచ్చు. వివిధ దేశాల్లో ఏఐ అభివృద్ధి చేస్తున్న సంస్థలు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను రూపొందించడం, వాటి అమలును పరిశీలించడం దీని ప్రధాన లక్ష్యాలుగా ఉండవచ్చు. అత్యంత శక్తివంతమైన ఏఐ నమూనాల అభివృద్ధిలో భద్రతా పరీక్షలు, తనిఖీలు, వనరుల వినియోగంపై పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
అయితే, ఈ విధానం విజయవంతం కావాలంటే అమెరికా, చైనా సహా ఏఐ రంగంలో ముందున్న దేశాల మధ్య సహకారం అవసరం. అంతర్జాతీయంగా ఒకే విధమైన నియమాలను అంగీకరించడం, వాటిని అమలు చేయడం ఈ ప్రతిపాదనలో కీలక సవాళ్లుగా నిలవనున్నాయి.

