జగిత్యాల జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్లో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి బంధువులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మల్యాల మండలానికి చెందిన అనిల్ కుమార్, అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిది వేర్వేరు కులాల వివాహం కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు రక్షణ కావాలని కోరుతూ ఈ జంట ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని కౌన్సెలింగ్ కోసం జగిత్యాల సఖి సెంటర్కు పంపించారు.
సఖి సెంటర్లో కౌన్సెలింగ్ జరుగుతుండగా, యువతి బంధువులు 15 మంది అక్కడికి చేరుకుని అనిల్ కుమార్ పై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అనిల్ కుమార్ తల, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బంధువులు యువతిని బలవంతంగా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినా, సఖి సెంటర్ సిబ్బంది అడ్డుకోవడంతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముందే ఫిర్యాదు చేసినా రక్షణ కల్పించడంలో పోలీసుల వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి.

