కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకెదాటు డ్యామ్ ప్రాజెక్టుపై రాజకీయ రగడ రాజుకుంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు నిలిపివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమ రాష్ట్ర భూభాగంలో డ్యామ్ నిర్మించుకునే హక్కు తమకే ఉందని, ఇతరుల అనుమతి అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకెదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్, ప్రధాని మోదీకి లేఖ రాశారు. దిగువ రాష్ట్రాలైన తమిళనాడు, ఇతర కావేరీ పరీవాహక రాష్ట్రాల సమ్మతి లేకుండా మేకెదాటు ప్రాజెక్టుకు ఎలాంటి చట్టపరమైన లేదా పరిపాలనా అనుమతులు ఇవ్వకూడదని, కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రాజెక్టు ప్రాంతంలో చేపట్టిన పరిశీలనల ఆధారంగా తదుపరి చర్యలను నిలిపివేయాలని, కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఇతర పరీవాహక రాష్ట్రాల అంగీకారం లేకుండా ముందుకు తీసుకెళ్లకుండా చూడాలని ఆయన కోరారు. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు వద్ద 67.16 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని, సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా తమిళనాడుకు నెలవారీగా అందాల్సిన నీటి పంపిణీపై కూడా ప్రభావం పడవచ్చని విజయ్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2026-27లో నీటి కొరత కారణంగా కావేరీ డెల్టా ప్రాంత రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మేకెదాటు ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక () అనుమతుల కోసం కర్ణాటక ముఖ్యమంత్రి కేంద్ర జలశక్తి శాఖ, పర్యావరణ శాఖ అధికారులతో సమావేశమైనట్లు వచ్చిన వార్తలపై విజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్న ప్రాంతాన్ని పరిశీలించినట్లు వచ్చిన వార్తలపైనా అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాలు తమిళనాడు రైతుల్లో ఆందోళన పెంచుతున్నాయని చెప్పారు. 2016న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, కావేరీ జల వివాదాల పరిష్కారం కోసం గతంలో కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పును విజయ్ తన లేఖలో ప్రస్తావించారు. ఈ తీర్పులకు అనుగుణంగా ప్రాజెక్టు ఉందని నిరూపించే వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కోరారు. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసిందని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని, కేంద్ర జలశక్తి శాఖ మార్గదర్శకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని వివరించారు.










