ఒక పన్నుపై మరో పన్ను విధించినంత మాత్రాన దానిని చట్టవిరుద్ధమైన పన్నుపై పన్నుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పన్ను విధించే అంశం, ఆ పన్ను మొత్తాన్ని లెక్కించే విధానం రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది. ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో అమ్మకపు పన్నుపై విధించిన 10 శాతం అదనపు సుంకానికి సంబంధించిన వివాదంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇందులో జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ ఎన్.వి. అంజారియా, జస్టిస్ అరుణ్ పల్లి, జస్టిస్ వి. మోహన, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు అమ్మకపు పన్నుపై విధిస్తున్న 10 శాతం అదనపు సుంకం చట్టబద్ధతపై గతంలో న్యాయస్థానాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 1998 నుంచి పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలించింది.
పన్నుపై పన్ను వాదనపై సుప్రీంకోర్టు వివరణ
ఒడిశా అమ్మకపు పన్ను చట్టం-1947లోని సెక్షన్ 5-ఏ, పంజాబ్ జనరల్ సేల్స్ ట్యాక్స్ చట్టం-1948లోని సెక్షన్ 5(1-సి) ప్రకారం, నిర్దిష్ట టర్నోవర్ పరిమితిని దాటిన వ్యాపారులపై చెల్లించాల్సిన అమ్మకపు పన్నులో 10 శాతం అదనపు సుంకం విధించారు. దీనిని వ్యాపారులు సవాలు చేస్తూ, ఇప్పటికే విధించిన పన్నుపై మరోసారి పన్ను విధించడం చట్టబద్ధం కాదని వాదించారు. ఈ విధానం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

