హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పేరు ప్రస్తావనకు రావడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో పుట్టా మహేష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్లు వినిపించడంపై సీపీఐ నాయకుడు నారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేరు కూడా బయటకు రావడం కలకలం రేపుతోంది.
ఏలూరు ఎంపీ అయిన పుట్టా మహేష్‌కు మొయినాబాద్ ఫామ్ హౌస్‌తో ఎలాంటి సంబంధం ఉందని నారాయణ ప్రశ్నించారు. డ్రగ్స్ కార్యకలాపాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.











