రష్యాలోని ఇర్కుట్స్క్లో యాంటీ-ప్లేగ్ పరిశోధనా సంస్థకు చెందిన ఓ మహిళా సిబ్బంది అనుమానాస్పదంగా మరణించడం కలకలం రేపింది. ప్రయోగశాలలో టెస్ట్ ట్యూబ్ పగిలిన ఘటన తర్వాత ఆమెకు తీవ్రమైన న్యుమోనియా లక్షణాలు కనిపించాయని, అనంతరం ఆమె మరణించిందని ప్రాంతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆమె మరణానికి ప్లేగు బ్యాక్టీరియానే కారణమని రష్యా అధికారులు ఇప్పటివరకు నిర్ధారించలేదు.
మరణించిన మహిళతో సంబంధం ఉన్న సుమారు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం. కొన్ని ఆసుపత్రుల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రయోగశాలలో పనిచేసే వ్యక్తి మరణించడంతో న్యుమోనిక్ ప్లేగు వ్యాప్తిపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, ఇప్పటివరకు ఇతరుల్లో ప్లేగు కేసులు లేదా నిరంతర మానవుల మధ్య వ్యాప్తికి ఆధారాలు లేవని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యెర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసినప్పుడు న్యుమోనిక్ ప్లేగు ఏర్పడుతుంది. ఇది ప్లేగు వ్యాధిలో అత్యంత తీవ్రమైన రూపాల్లో ఒకటి. సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా శ్వాస తీసుకున్నప్పుడు వెలువడే శ్వాసకణాల ద్వారా సమీపంలోని వ్యక్తులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. చికిత్స లేకపోతే ప్రాణాంతకంగా మారవచ్చు. అయితే వ్యాధిని త్వరగా గుర్తించి సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.










