రాష్ట్ర ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలన సాగించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో, పొన్నూరు నియోజకవర్గం నుంచి పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళి నేతృత్వంలో టీడీపీకి చెందిన యువత, నాయకులు, కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు రెండేళ్ల కూటమి పాలనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ పాలనతో ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నియంతృత్వ పాలనకు వైయస్ జగన్ మాత్రమే ధీటుగా సమాధానం చెప్పగలరని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని 15 ఏళ్లు ముందుకు తీసుకెళ్తే, 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు రెండేళ్లలోనే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు.
పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరాచకాలు తారాస్థాయికి చేరాయని, ఆయన వ్యవహారశైలి నచ్చకనే పలువురు టీడీపీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరుతున్నారని సజ్జల తెలిపారు. ఎమ్మెల్యే అణచివేతకు దీటుగా వైయస్సార్సీపీ నాయకుడు అంబటి మురళి చేస్తున్న పోరాటాలను ఆయన అభినందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్సీపీ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.











