దక్షిణ భారతదేశంలో నేరాల నియంత్రణకు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక మోసాలు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ సదస్సులో ఈ పిలుపునిచ్చారు.
మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో మార్పులు తీసుకురావాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ నిరంతరం సంస్కరణలు చేపట్టాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి, దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడం పోలీసు అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలి
నేరాలు రాష్ట్రాల సరిహద్దులకే పరిమితం కావడం లేదని, ఒక రాష్ట్రంలో జరిగే ఆర్థిక మోసం, సైబర్ నేరం లేదా మాదకద్రవ్యాల రవాణా ఇతర రాష్ట్రాల ప్రజలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం వివరించారు. అందువల్ల వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే వ్యవస్థలు అవసరమని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థలను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పోలీసు వ్యవస్థకు కేటాయించే వనరులను ఖర్చుగా కాకుండా ప్రజల భద్రత, మెరుగైన సమాజ నిర్మాణానికి చేసే పెట్టుబడిగా చూడాలని అభిప్రాయపడ్డారు.











