గోండి కోయ భాషను ప్రామాణీకరించడంతో పాటు నిఘంటువు రూపకల్పనకు సంబంధించి నాలుగు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్ భద్రాచలంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు ఎనిమిది రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మాట్లాడుతూ, ఆదివాసీ తెగల భాషలు, సంస్కృతులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడం వల్ల అవి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గోండి కోయ సమాజానికి చెందిన భాష, సంస్కృతిని పరిరక్షించడం చారిత్రక అవసరమని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను నేర్పించి, సంప్రదాయాలను కొనసాగించేలా చూడాలని సూచించారు. భాషా, సాంస్కృతిక పరిరక్షణకు భద్రాచలం ఐటీడీఏ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, ప్రాంతాలు మారినా ఆదివాసీ సమాజాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల్లో అనేక సారూప్యతలు ఉన్నాయని అన్నారు. ప్రాంతానుసారం పదాల ఉచ్చారణలో మార్పులు ఉన్నప్పటికీ వాటి అర్థాలు ఒకే విధంగా ఉంటాయని, గోండి కోయ భాషకు ప్రాచీన చరిత్ర ఉందని పేర్కొన్నారు.











