ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆరు రాష్ట్రాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వ్యక్తులను గుర్తించి, తిరిగి నమోదు చేసేందుకు అవసరమైన సహాయం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఇటీవల ఓటర్ల జాబితాల సవరణపై వివిధ రాష్ట్రాల్లో చర్చలు, రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ చర్యలు చేపట్టింది. గతంలో ఓటరుగా నమోదై ఉన్నప్పటికీ తాజా జాబితాలో పేరు కనిపించని వారు, అలాగే తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత తమ వివరాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) సంబంధిత ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. గత జాబితాలో పేర్లు ఉండి, ప్రస్తుత జాబితాలో కనిపించని వ్యక్తులను గుర్తించేందుకు పాత, కొత్త ఓటర్ల జాబితాలను పోల్చి చూస్తారు. అర్హత ఉన్నప్పటికీ పేరు నమోదు కాకపోతే, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఓటర్ల వివరాల్లో పొరపాట్లు ఉన్నా, చిరునామా మార్పు కారణంగా పేరు కనిపించకపోయినా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి పరిష్కారం పొందవచ్చు. అయితే, ఇంటింటి పరిశీలనలో పేరు గుర్తించినంత మాత్రాన ఓటు హక్కు స్వయంచాలకంగా పునరుద్ధరించినట్లు కాదు. అధికారిక దరఖాస్తు, అర్హత పరిశీలన, తుది ఆమోదం అవసరం. ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన వ్యక్తులు ఫారం-6 ద్వారా తమ పేరును చేర్చాలని దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత కూడా ఓటరుగా నమోదు కావడానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. దరఖాస్తుతోపాటు అవసరమైన గుర్తింపు, నివాసం, వయస్సుకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి రావచ్చు.











