కడప, జులై 04
రోడ్డు భద్రతపై ప్రజలకు, ముఖ్యంగా వాహనదారులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కర్నూలు రేంజ్ డిఐజి డా. కోయ ప్రవీణ్ ఐపిఎస్, జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు కడప జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల లక్ష్యం రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం.
కర్నూలు రేంజ్ డిఐజి డా. కోయ ప్రవీణ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ సూచనలతో జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా కడప జిల్లాలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యార్థినీ, విద్యార్థులకు, యువతకు, ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు, ద్విచక్ర వాహన దారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ హెల్మెట్లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండ వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టు ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు.
పిల్లలపై చాలా గురుతర బాధ్యతలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములతో సుఖసంతోషాలతో ఉండాలంటే వారి పెద్దలకు రోడ్డు భద్రతపై చెప్పాల్సిన అవసరం ఉందని అవగాహన కల్పించారు. విద్యార్థులు రోడ్ క్రాస్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మైనర్లకు వాహనం ఇవ్వకూడదని తల్లి దండ్రులకు సూచించారు. వాహనం నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలు, లైసెన్స్ లను చోదకులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని అన్నారు. పౌరులందరూ రోడ్డు భద్రతా నియమాలకు కట్టుబడినప్పుడే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు.










