మదనపల్లె, జులై 04
పీలేరు పట్టణంలో వరుస ఇళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీరి నుండి రూ. 17.94 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుతో 7 దొంగతనం కేసులు ఛేదించబడ్డాయి.
పీలేరు పట్టణంలో వరుస ఇళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు శనివారం చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో పీలేరు సీఐ యు. వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు రహీం, లోకేష్‌లు తమ సిబ్బందితో కలిసి కావడి సోమశేఖర్ (మదనపల్లి), కర్ణాటకకు చెందిన జోగి బంగారప్ప, శ్రీనివాసులు రాజులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 17.44 లక్షల విలువైన 109 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల విలువైన ఒక మోటార్ సైకిల్‌ను (మొత్తం విలువ రూ. 17,94,000/-) స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా అరెస్టుతో పీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మొత్తం 7 దొంగతనం కేసులు (Cr.No: 48, 76, 103, 11, 142, 143,145/2026) ఛేదించబడ్డాయి. నిందితులపై బిఎన్ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం జరుగుతుంది.












