మదనపల్లె, జూన్ 30
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లి వద్ద భూ వివాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. భూ కబ్జాదారులు మహిళలపై దాడి చేసి గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లి వద్ద బలహీనులైన మహిళలపై భూ కబ్జాదారులు దాడికి తెగబడిన ఘటన చోటు చేసుకుంది. భూముల ధరలు పెరగడంతో కబ్జాదారులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం లక్ష్మీదేవి, అలివేలమ్మలపై చలపతి, మల్లికార్జున, వేణు, లోకేష్ దాడి చేసి గాయపరిచారు.
వారసత్వంగా వచ్చిన భూములకు సంబంధించి భాగ పరిష్కారం కాకపోవడంతో అక్కచెల్లెళ్ళైన అలివేలమ్మ, లక్ష్మీదేవికి నాగరాజు మధ్య గత కొంతకాలంగా కోర్టులో 55 సెంట్ల భూమికి వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో నాగరాజు ఒకటిముక్కల్ సెంటు భూమిని జి.రామకృష్ణ, జి.గోపాల్లకు విక్రయించారు. ఈ భూమి ప్రస్తుతం కోర్టు కేసులో ఉంది.
కోర్టు కేసులో ఉన్న భూమిని కొనుగోలు చేసిన జి.రామకృష్ణ, జి.గోపాల్ తరఫున చలపతి, మల్లికార్జున, వేణు, లోకేష్ రంగంలోకి దిగి కంచె ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిని లక్ష్మీదేవి, అలివేలమ్మ అడ్డుకోవడంతో మహిళలపై దాడి చేసి గాయపరిచారు. స్థానికులు బాధితులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












