వజ్రప్రహార్" (డాక్సిన్ టైమ్స్) జూలై 04
కడప జిల్లాలో 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన రికార్డులు లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచంపేట, గుర్రాల గడ్డ ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కడప ఇంచార్జ్ డీఎస్పీ ఇ. బాలస్వామి రెడ్డి పర్యవేక్షణలో, సీఐ ఎం. తిమ్మా రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు అమర్ నాథ్ రెడ్డి, ప్రదీప్ కుమార్, సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు.
పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లలో, అనుమానిత ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, వాహనాల రికార్డులను పరిశీలించారు. సరైన రికార్డులు లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రికార్డులు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళల రక్షణ చట్టాలపై స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.












