వైఎస్సార్ కడప జిల్లా మండలం పెద్దపల్లె రైతు భరోసా కేంద్రం పరిధిలో సాగుచేసిన పసుపు పంటను ఉద్యానాధికారి వై.ఎస్. శ్రీనివాసుల రెడ్డి బుధవారం పరిశీలించారు. అధిక ఉష్ణోగ్రత, వేడి నుండి పంటను కాపాడుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులతో ఆయన ముఖాముఖి చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసుపు పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలమని, 20 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో పంట బాగా పెరుగుతుందని తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రారంభ దశలో వేడి ఎక్కువగా ఉంటే దుంపల నుండి వేర్లు రావడం ఆలస్యమై మొలక శాతం తగ్గుతుందని, ఆకుల చివర్లు ఎండి గోధుమ రంగులోకి మారి పెళుసుగా తయారవుతాయని, దీంతో ఆహార తయారీ తగ్గి పెరుగుదల కుంటుపడుతుందని వివరించారు. నేల తేమ ఆవిరై దుంప ఏర్పాటు దెబ్బతిని కుర్కుమిన్ శాతం, రంగు తగ్గుతుందని తెలిపారు.











