రబీ సీజన్ లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ శనగల పంపిణీలో రాజకీయ జోక్యం జరుగుతోందని, చేతివాటం ప్రదర్శిస్తున్న రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి. దస్తగిరి రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి రైతుకు ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సబ్సిడీ శనగలు అందజేయాలని కోరారు.
ఆదివారం కడపలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా సబ్సిడీ శనగల రిజిస్ట్రేషన్, పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతినడంతో, రైతులు రబీ సీజన్ పైనే ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో శనగ విత్తనాల ధరలు అధికంగా ఉండటంతో రైతులంతా సబ్సిడీ కోసం రైతు సేవా కేంద్రాల వద్దకు వస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం, గ్రామాల్లోని ఆర్ఎస్కేల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు చెల్లించిన రైతులకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చి శనగలు పంపిణీ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.












