జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి వనరుల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో జలధార - జలహారతి పథకం కింద చేపట్టిన ఫీడర్ ఛానల్ పునరుద్ధరణ పనులు, చెరువుకు నీరు చేరే సరఫరా కాలువలు (సప్లై ఛానల్స్), మైనర్ ఇరిగేషన్ ట్యాంకు అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనులు జరుగుతున్న ప్రాంతానికి వాహన మార్గం అందుబాటులో లేకపోవడంతో, అధికారులు, సిబ్బందితో కలిసి ఆటోలో ప్రయాణించి, పొలాల మధ్యలో ఉన్న రహదారి ద్వారా దాదాపు 4 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లి పనులను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పనుల తీరును ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
ఈ పనులను నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. సాగునీటి వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, రైతులకు సకాలంలో నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.










