రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో "రైతన్న మీకోసం" కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుపై అవగాహన కల్పించనున్నారు.
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం కలెక్టరేట్ లో "రైతన్న మీకోసం" కార్యక్రమ ప్రచార కరపత్రాలను అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా లాభసాటి వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులు, ఖరీఫ్ పంటల సాగు సూచనలు, విత్తనాలు-ఎరువుల లభ్యత, సహజ వ్యవసాయం, నీటి యాజమాన్యం, డ్రోన్ సాంకేతికత వంటి అంశాలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారు. అలాగే, రైతుల సమస్యలను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
రైతు సేవా కేంద్రాల సేవలు, పంటల నమోదు, పంటల బీమా, వ్యవసాయ యంత్రాల వినియోగంపై కూడా సమాచారాన్ని రైతులకు అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
జిల్లాలోని రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విజ్ఞప్తి చేశారు.









