త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై మరియు ఫ్యాక్షన్ తో సంబంధం ఉన్న వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐపీఎస్, వివిధ ప్రత్యేక విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో భాగంగా, ఎస్పీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ట్రాఫిక్ సి.ఐ.లను ఆదేశించారు. మానవ అక్రమ రవాణాపై నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో సహకరించాలని, గృహ చోరీ కేసుల్లో దొంగలను పట్టుకుని సొత్తును రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. తీవ్రమైన కేసులలో విచారణ త్వరితగతిన పూర్తి చేసి, నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.
సోషల్ మీడియాలో మహిళలు, బాలికలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలని, గతంలో స్మగ్లింగ్ కు పాల్పడిన వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని సూచించారు.
రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, శక్తి టీంల బీట్లు పెంచి ఈవ్ టీజింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.












