వన్యప్రాణుల సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం, సమాచార మార్పిడికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న అనంత్ అంబానీకి చెందిన వంతారాలో యూరేషియన్ రీజినల్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ () వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు సంరక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 30 దేశాలకు చెందిన 98 సంస్థల ప్రతినిధులతో పాటు భారత్‌లోని 29 జంతుప్రదర్శనశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో వంతారా కీలక ప్రకటన చేసింది. తమ సంస్థ అభివృద్ధి చేసిన ఏఎన్టీజెడ్ () జూలాజికల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్‌ను సభ్య సంస్థలకు ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ సాఫ్ట్‌వేర్‌లోని ఓపెన్ డేటా ఎక్స్ఛేంజ్ వ్యవస్థ ద్వారా వివిధ దేశాల్లోని జంతుప్రదర్శనశాలలు సమాచారాన్ని పరస్పరం పంచుకోవచ్చు. జంతువుల ఆరోగ్యం, వాటి ప్రవర్తన, సంతానోత్పత్తి, ఆహారం, సంరక్షణకు సంబంధించిన వివరాలను ఒకే వేదికపై నమోదు చేసి విశ్లేషించడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీంతో ఒక సంస్థలో సేకరించిన పరిశోధన వివరాలు మరో దేశంలోని సంస్థలకు కూడా ఉపయోగపడతాయి. అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సమాచారం ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సదస్సులో వంతారా పలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించింది. వీటిలో వెస్పర్ (జంతువుల శబ్దాల ఆధారంగా జాతులను గుర్తించే పరికరం), స్మార్ట్ ఎగ్ అనాలిసిస్ (పక్షుల గుడ్ల అభివృద్ధిని పర్యవేక్షించే సాంకేతికత), ఎన్ఎఫ్సీ ఆధారిత వ్యవస్థ (జంతువుల సంరక్షణ, వైద్య సేవల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసేందుకు) ఉన్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా జంతువుల సంరక్షణలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంటుందని నిర్వాహకులు వివరించారు. సదస్సులో అముర్ పులి, ఓరియంటల్ కొంగ, బ్లాకిస్టన్ డేగ గుడ్లగూబ, గ్రేట్ బస్టర్డ్ వంటి అరుదైన జంతు, పక్షి జాతుల సంరక్షణపై నిపుణులు లోతుగా చర్చించారు. వివిధ దేశాల్లోని సంస్థలు సమన్వయంతో పనిచేస్తే ఈ జాతుల పరిరక్షణ కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. పాముల సంరక్షణ, పాముకాటు నివారణ, పట్టణ ప్రాంతాల్లో జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల వైద్య సేవలు, జంతువుల పోషణ, ప్రకృతి విపత్తుల సమయంలో జంతువులను రక్షించడం వంటి అంశాలపైనా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇండియన్ జూ ఇయర్‌బుక్ 2026 పదకొండో సంపుటిని విడుదల చేశారు. వన్యప్రాణుల సంరక్షణ, జంతుప్రదర్శనశాలల అభివృద్ధికి సేవలందించిన భారత్, ఇతర దేశాలకు చెందిన ఆరుగురు ప్రముఖులకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. 2027 వార్షిక సదస్సు నిర్వహణ బాధ్యతలను చైనాకు అప్పగించారు.












