జిల్లాలో జూదం, పేకాట కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 24 గంటల పాటు నిఘా కొనసాగిస్తూ, జూదం స్థావరాలపై దాడులు నిర్వహించనున్నాయి.
జూదం నిర్వాహకులు, పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో జూదానికి అలవాటుపడి ఎంతోమంది తమ కష్టార్జితాన్ని కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యసనం కారణంగా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, కలహాలు ఏర్పడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత క్షణికమైన ఆశలకు లోనై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. జూదం కేసుల్లో పట్టుబడి కేసులు నమోదైతే పోలీసు రికార్డుల్లో వివరాలు నమోదవుతాయని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం జరిగే పోలీసు వెరిఫికేషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దర్యాప్తులో భాగంగా చట్టప్రకారం వేలిముద్రలు కూడా సేకరించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నా, నిర్వహిస్తున్నా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712686133 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. జూదం నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.












