కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ల అగ్రహారంలో పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ అదృశ్యమైన రెండేళ్ల పసికందు సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు హైటెక్ పద్ధతుల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, కేసులో పురోగతి సాధించేందుకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
ఈ నెల 6వ తేదీన ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైన జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు మొదట ఆలస్యంగా గమనించారు. అనంతరం, బాలికతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క మూడు రోజుల తర్వాత గ్రామానికి తిరిగి రావడంతో, పోలీసులు దానిని కీలకంగా భావించారు. కుక్క మెడకు జీపీఎస్ ట్రాకర్ను అమర్చి అటవీ ప్రాంతంలోకి వదిలి, దాని కదలికలను పర్యవేక్షించారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు 8 కిలోమీటర్లు తిరిగినట్లు గుర్తించారు. ఈ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసినా ఫలితం దక్కలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పెద్దాపురం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో దాదాపు 150-250 మందితో కూడిన పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, క్యూఆర్టీ బృందాలు 10 టీమ్లుగా ఏర్పడి, 1000 ఎకరాల అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. బాలిక కాళ్లకు ఉండే వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను, దట్టమైన అడవులను స్కాన్ చేయడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.












